అమరావతి: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. రేపటి ఉభయసభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం బీఏసీ సమావేశంలో తీసుకోనున్నారు.
కాగా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై స్పష్టత లేదు. గతంలో మాదిరిగానే కేవలం మండలి సభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి పక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరు అవుతామని వైసీపీ చెబుతుండగా.. రాజ్యాంగ ప్రకారంలో సభలో తగినంత సంఖ్య బలం లేకుంటే ప్రతి పక్ష హోదా ఎలా వస్తుంది అని కూటమి సర్కార్ ప్రశ్నిస్తోంది.