ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందుకుగాను రూ. 86,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనుందని ప్రధానికి వివరించారు. ఈ చారిత్రాత్మక పెట్టుబడికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోనే గూగుల్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనుందని చంద్రబాబు తెలిపారు.
గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరగనుంది.