మేనిఫెస్టో కవర్ పేజీపై 'మోదీ' ఫోటో లేదు.. ఎందుకు..?

టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది

By Medi Samrat  Published on  1 May 2024 9:30 AM IST
మేనిఫెస్టో కవర్ పేజీపై మోదీ ఫోటో లేదు.. ఎందుకు..?

టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కవర్ పేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటోలు మాత్ర‌మే ఉన్నాయి. మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో 2024 ఏపీ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జనసేన, బీజేపీ 31 అసెంబ్లీ, ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

కూటమిలోని మూడు పార్టీలు సంయుక్తంగా మేనిఫెస్టోను రూపొందిస్తాయని అంతా ఊహించారు. కానీ బీజేపీ తన ఎన్‌డీఏ మేనిఫెస్టోను జాతీయ‌ స్థాయిలో విడుదల చేసిందని.. రాష్ట్ర స్థాయి మ్యానిఫెస్టోలతో సంబంధం లేదని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ప్రతి ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం'లో చంద్రబాబుకు పేరుందని కాషాయ పార్టీ నాయకత్వానికి బాగా తెలుసు కాబట్టే కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరమైందని ఎన్డీయే కూటమి రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపించింది. రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందించే బాధ్యత కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై ఉన్నందున.. బీజేపీ మ్యానిఫెస్టోలో భాగం కావడానికి నిరాకరించిందని అంటున్నారు.

Next Story