ఆ పని ఎన్టీఆరే చేశారు.. రేపు మేం కూడా..

By అంజి  Published on  25 Jan 2020 2:05 PM GMT
ఆ పని ఎన్టీఆరే చేశారు.. రేపు మేం కూడా..

అమరావతి: రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా అంటూ ఆయన ప్రశ్నించారు. హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారన్నారు. మీరు ఇచ్చిన హామీలను మేము అమలు చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీపై అంబటి మండిపడ్డారు.

వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫోస్టోలో పెట్టిందన్నారు. అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారిందని బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పిందని అంబటి తెలిపారు. రైతుల నుంచి భూములు బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారని, రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పిందన్నారు. బీజేపీతో పవన్‌ కల్యాణ్‌ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని విప్లవాత్మకమైన సంస్కరణలు సీఎం జగన్‌ తెస్తున్నారని ఆయన వెల్లడించారు. విశాఖలో సీఎం జగన్‌ ఒక ఎకరా భూమి కొన్నట్లు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆధారాలు చూపించాలన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని అంబటి వ్యాఖ్యనించారు.

చంద్రబాబు ప్రజాస్వామాన్ని ఖునీ చేశారని, ఫిరాయింపులను ప్రోత్సహించింది ఆయనేనన్నారు. తమ పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేయాలని సీఎం జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాలరీలో కూర్చున్నారన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్‌ చేసిన తాము ఎక్కడా వెనుకడుగు వేయమన్నారు. రూ. 5 కోట్లతో న్యాయవాదిని పెట్టుకున్నారంటూ గోల పెడుతున్న చంద్రబాబు రాజధాని కాన్సెలెటెన్సీకి రూ.845 కోట్లు చేశారన్నారు. మండలి రద్దు అవుతుందా లేదా అన్నది సోమవారం వరకు వేచి చూడాల్సిందేన్నారు. మండలి రద్దు చేయడం ఎవరి వల్ల కాదని టీడీపీ నేతలు అంటున్నారని, గతంలో ఎన్టీఆరే మండలిని రద్దు చేశారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. మండలి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటామన్నారు.

Next Story