సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని మరచిపోకముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నడ నటుడు, ఫిట్నెస్ ట్రైనర్ అయిన సుశీల్ గౌడ తన సొంత ఊరు కర్ణాటక లోని మాండ్యలో ఆత్మహత్య చేసుకున్నాడు.

సుశీల్ గౌడ ఇందువలు లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మాండ్య ఎస్పీ కె.పరశురామ్ మీడియాకు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేశాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు ఆయన అన్నారు. సుశీల్ గౌడ ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీస్తున్నామని ఆయన తెలిపారు.

కన్నడ సీరియల్ అంతఃపుర ద్వారా సుశీల్ గౌడ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరో దునియా విజయ్ దర్శకత్వం వహిస్తున్న 'సలగ' సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇకపై సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతాయని సుశీల్ గౌడ సన్నిహితులతో చెబుతూ ఉండేవాడట.. కానీ ఇలా విగతజీవిగా సుశీల్ గౌడ కనిపించాడు.

దునియా విజయ్ సుశీల్ గౌడ మృతిపై స్పందించాడు. సలగ సినిమాలో యంగ్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో సుశీల్ గౌడ మంచి నటనను కనబరిచాడని.. సుశీల్ కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద హీరో అవుతాడని భావించానని.. సినిమా రిలీజ్ కంటే ముందే మరణించడం చాలా బాధగా ఉందని దునియా విజయ్ వెల్లడించాడు.

సుశీల్ గౌడతో తాను 30 రోజుల పాటు పని చేశానని తనకే ఎంతో బాధగా ఉందని.. ఇక 30 ఏళ్ల పాటూ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు దునియా విజయ్. అన్ని సమస్యలకు ఆత్మహత్య సమాధానం కాదని దునియా విజయ్ చెప్పుకొచ్చాడు.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారని, ఎంతో మంది నమ్మకం కూడా కోల్పోతున్నారని, ఇకపై అయినా ఆత్మహత్యలు ఆగాలని కోరాడు దునియా విజయ్. కరోనా భయం వల్లే కాక, జీవించడానికి డబ్బు దొరకదనే నమ్మకాన్ని కోల్పోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నాడు. కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పాడు. పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ నటులు సుశీల్ గౌడ మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ ఇటీవలే చిరంజీవి సర్జాని కోల్పోయింది. ఇంతలో మంచి భవిష్యత్తు ఉన్న నటుడిని కూడా కోల్పోయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story