అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పద మృతి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 3:36 PM GMT
అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పద మృతి.!

న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మరణించారు. వారి ఇంటి వెనుక వైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో విగతజీవుల్లా పడి ఉన్నారు. చనిపోయిన వారిలో 8 సంవత్సరాల బాలిక కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వారు ఆ ఇంటిని కొనుక్కున్నారని న్యూజెర్సీ పోలీసులు తెలిపారు. ఇంతలో ఇలాంటి విషాదం చోటుచేసుకుంది.

62 సంవత్సరాల భరత్ పటేల్, 33 సంవత్సరాల నిషా పటేల్, ఆమె ఎనిమిది సంవత్సరాల కుమార్తె స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించారని అధికారులు ధృవీకరించారు. ఈస్ట్ బ్రాన్స్విక్ లోని ఇంట్లో వారు గ్రౌండ్ లెవల్ కంటే లోతైన పూల్ ను నిర్మించుకున్నారు. మొదట స్విమ్మింగ్ పూల్ లో కరెంట్ పాస్ అవ్వడం వలన చనిపోయారని అధికారులు భావించారు. కానీ అలాంటిదేమీ లేదని ఇన్వెస్టిగేషన్ లో తేలింది.

స్విమ్మింగ్ పూల్ ను చాలా లోతుగా నిర్మించారని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తున్నారు. స్విమింగ్ పూల్ లో కొన్ని చోట్ల చాలా లోతుగా ఉందని.. కుటుంబ సభ్యుల్లోని ముగ్గురిలో ఎవరైనా పొరపాటున పడి ఉంటే వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నంలో మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ ఘటనపై అనుమానాలు మాత్రం వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 451000 డాలర్లు పెట్టి ఆ ఇంటిని భరత్ కుటుంబం కొనుక్కుందని అధికారులు ధృవీకరించారు. సోమవారం నాడు వారి ఇంటి వెనుక వైపు నుండి అరుపులు రావడాన్ని తాము విన్నామని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిషా పటేల్ గట్టిగా అరిచిందని పోలీసులకు కొందరు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిపిఆర్(cardiopulmonary resuscitation) ను నిర్వహించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. ఈస్ట్ బ్రాన్స్విక్ ప్రజలు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారని మేయర్ బ్రాడ్ కోహెన్ తెలిపారు. భరత్ కుటుంబానికి, స్నేహితులకు తమ ప్రగాఢ సానుబూతి తెలుపుతున్నామని అన్నారు.

Next Story