మీ సెల్ఫీ పిచ్చి పాడుగానూ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 1:25 PM ISTసెల్ఫీలు తీసుకోవాలి.. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాలి.. లైక్ ల కోసం ఎదురుచూడాలి. ఇలా సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు తమ సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సమయానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వచ్చింది కానీ లేకపోతే వరద నీటిలో కొట్టుకుని వెళ్లే వాళ్ళే..!
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెంచ్ నదిలోకి దిగి ఇద్దరు అమ్మాయిలు ఫోటోలు తీసుకోవాలని అనుకున్నారు. ఇంతలో నీటి ఉధృతి ఎక్కువవ్వడంతో మధ్యలోనే నిలిచిపోయారు. దీంతో వీరితో పాటూ వచ్చిన మిగిలిన అమ్మాయిలు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి రక్షించారు. 6-8 మంది అమ్మాయిలు పెంచ్ నదికి పిక్నిక్ కు వచ్చారు. పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవడం కోసం వాళ్లు నీటిలోకి దిగినట్లు తెలుస్తోంది.
లోకల్ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. 'పెంచ్ నది దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి కొందరు అమ్మాయిలు విహారయాత్రకు వచ్చారు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం నీటిలోకి దిగారు. ఇంతలో వరద ఉధృతి పెరగడంతో ఓ రాయి మీద నిలబడ్డారు. ఆ ఇద్దరు అమ్మాయిలతో వచ్చిన మరికొందరు సామాచారం అందించడంతో మేము, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నాం. దాదాపు ఒక గంట పాటూ అక్కడే నిలబడి ఉన్నారు.. తాము వెళ్లి రక్షించామని' పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదని.. వారిద్దరూ కాస్త భయపడి ఉండడంతో ఆసుపత్రికి తరలించామని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విహారయాత్రలు అవసరమా.. పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఇలాంటి చేష్టలు చేస్తూ వారి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదని అన్నారు మరికొందరు.