కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 July 2020 5:05 PM ISTఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు.
జూన్ 29న హత్యకు గురైన భాస్కరరావు కేసులో పోలీసులు మొదట ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడు కూడా ఉన్నాడు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామ్యం కూడా ఉన్నట్లు తేలడంతో.. పోలీసులు రవీంద్రపై కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. రవీంద్ర విశాఖపట్నం వైపు వెళుతుండగా.. మార్గమధ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు.