టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగేనా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 3:22 PM GMT
టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగేనా.?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రెండు వారాల క్రితం అన్ లాక్ 1 సడలింపులతో ఊహించని రీతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. గడిచిన రెండువారాల్లో చూసుకుంటే దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వారంరోజులుగా రోజుకు 10 వేలు తక్కువ కేసులు నమోదైన దాఖలాలు లేవు. అన్ లాక్ 1 తో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలతో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా దేశ వ్యాప్తంగా సుమారు 200 రైళ్లను నడుపుతోంది. సరి, బేసి పద్ధతిలో షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. రవాణా మార్గాలకు కొంత సడలింపులు రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు కొందరు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసినపుడే కేసులు తక్కువగా ఉన్నాయని, మళ్లీ లాక్ డౌన్ పెట్టండని వేడుకుంటున్నారు మరికొందరు.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ప్రమోట్ చేశాయి. తొమ్మిదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్క్స్ లిస్ట్, గ్రేడ్ లను ఇస్తారు. కాగా..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించి తీరుతామని ఇటీవలే విద్యాశాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. జూలై 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ పది పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా ఎవరిని పెడతారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. వార్డు వాలంటీర్లా ? లేక ఉపాధ్యాయులా ? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా గాలి వ్యాపిస్తున్న నేపథ్యంలో పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రెండు, మూడ్రోజుల క్రితమే ఇంటర్ ఫలితాలొచ్చాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 11 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రతి పరీక్షా సెంటర్ లో రూమ్ కొక హ్యాండ్ వాష్, ఆటోమెటిక్ శానిటైజ్ మెషీన్లను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. కానీ ఈ పరీక్షల నిర్వహణపై కూడా తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. తమ పిల్లలు తప్పినందుకు బాధగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ఏదొక రూపంలో మనిషిపై దాడి చేస్తోందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అత్యధిక పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై మాత్రం సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

Next Story
Share it