జూలై 15 నాటికి భారత్‌లో 8లక్షల కరోనా కేసులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 12:11 PM GMT
జూలై 15 నాటికి భారత్‌లో 8లక్షల కరోనా కేసులు..

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తక్కవ కేసులు సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికి లాక్‌డౌన్‌ను దశల వారిగా సడలిస్తుండడంతో సగటున రోజుకు పదివేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక భారతలో జూలై 15 నాటికి భారత్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చుతుందని అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అప్పటికి భారత్‌లో 8 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై మిచిగాన్‌ యూనివర్సిటీ అధ్యయనం చేపట్టారు.

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదు కాగా.. 380 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9,900 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,80,013 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,53,178 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఎనిమిదవ స్థానానికి చేరుకుంది.

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న నవెూదైంది. జూన్‌ 15 వరకు మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి చేరింది. అంటే 138 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలకు చేరుకుంది. జూన్‌ నెల ప్రారంభం అయ్యేసరికి దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.76లక్షలుగా ఉంది. అయితే.. జూన్‌ 15వ నాటికి ఈ సంఖ్య 3.32 లక్షలకు చేరింది. అంటే.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 1.55లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇంతలా కేసులు పెరగడానికి కారణం లాక్‌డౌన్‌లో భారీగా సడలింపులు ఇవ్వడమే.

Next Story