భారత్‌లో 24గంటల్లో 10,667 కేసులు.. 380మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 4:36 AM GMT
భారత్‌లో 24గంటల్లో 10,667 కేసులు.. 380మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదు కాగా.. 380 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9,900 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,80,013 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,53,178 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కాస్త ఊరటనిస్తుంది. ఇక రికవరీ రేటు 52.5శాతంగా ఉంది. దేశంలో కరోనా ఉదృతి దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా 81 లక్షల మంది కరోనా మహమ్మారి భారీన పడ్డారు. ఇప్పటి వరకు 4.39 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. 21లక్షల పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్‌( 8.9లక్షలు), రష్యా(5.3లక్షలు) లు ఉన్నాయి.

Next Story