నేడు, రేపు ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

By సుభాష్  Published on  16 Jun 2020 2:43 AM GMT
నేడు, రేపు ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో ప్రధాని నరేంద్రమోదీ మంగళ, బుధవారాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్‌ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలా..? వద్దా.. అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, మంగళవారం జరిగే సమావేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెప్టినెంట్‌ గవర్నర్లు, అధికారులతో మోదీ మాట్లాడనున్నారు. పంజాబ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.

ఇక బుధవారం జరిగే సమావేశంలో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌తో సమావేశం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనాపై చర్చించనున్నారు మోదీ. ఇక మోదీ సమావేశం అనంతరం లాక్‌డౌన్‌పై క్లారిటీ రానుంది. ఇప్పటికే మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఇప్పటి వరకూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకోలేదని తెలిపింది. అయితే మళ్లీ లాక్‌డౌన్‌పై ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులు క్లారిటీ ఇచ్చేశారు. లాక్‌డౌన్ విధించే ఉద్దేశం లేదని, కేసులు పెరిగినా లాక్‌డౌన్ విధించేది లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు కూడా నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇక మోదీ మనసులో ఏముందో రెండు రోజుల అనంతరం స్పష్టత రానుంది.

Next Story