ఎవరినైనా దెబ్బ తీయాలంటే.. ఆ వ్యూహం ఎలా ఉంటుందో బయటపెట్టారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 12:22 PM IST
ఎవరినైనా దెబ్బ తీయాలంటే.. ఆ వ్యూహం ఎలా ఉంటుందో బయటపెట్టారు

పార్టీ ఎంత పెద్దదైనా కొవొచ్చు.. అంతర్గత ప్రజాస్వామ్యం.. మనసులో ఉన్న మాటల్ని బయటకు మాట్లాడే అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ ఇవ్వదు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహాయింపు కాదు. ఆ మాటకు వస్తే.. జాతీయ పార్టీతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల తీరు మరింత భిన్నంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయం మీదా ఒక కన్నేయటమే కాదు.. నోటినుంచి వచ్చే ప్రతి మాట వెనుకున్న పరమార్థం ఏమిటన్నది ఆరా తీసే పటిష్టమైన వ్యవస్థ జగన్ పార్టీలో కాస్త ఎక్కువే.

ఇలాంటివేళలో పార్టీకి ఒక పట్టాన కొరుకుడుపడని రీతిలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నోటి నుంచి వస్తున్నమాటలు పార్టీని.. అధినేతను ఇరుకునపడేలా చేస్తున్నాయి. తాజాగా తనను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుపై విరుచుకుపడిన రామరాజు.. ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయటం కోసం పార్టీ అనుసరించే వ్యూహాన్ని బయటపెట్టేశారు. పార్టీ ఫార్ములా ఎలా ఉంటుందో మరింత స్పష్టమయ్యేలా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

టైమ్లీగా తిడితేనే పార్టీలో పదవులు వస్తాయన్న రఘురామ.. పార్టీ వ్యూహం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్దాంతం ఉంటుందన్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై ఒక మాట అనాలంటే ఆయనకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చేత మాట్లాడిస్తారు. ఒక బీసీ నాయకుడ్ని టార్గెట్ చేయాలంటే పార్టీకి చెందిన మరో బీసీ నాయకుడి చేత కామెంట్ చేయిస్తారు. అందుకు తగ్గట్లే సదరు నేతను తెర మీదకు తీసుకొస్తారన్నారు.

జగన్ సీటిస్తే.. ఇరవై రోజుల్లో ఎంపీని అయ్యానని తన ప్రియ మిత్రుడు ప్రసాదరాజు చేత అనిపించారన్న కృష్ణంరాజు.. తామంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు టైమిస్తున్నారంటూ ప్రసాదరాజు తనపై చేసిన విమర్శలకు ప్రతిఫలంగా మంత్రి పదవి సొంతం చేసుకోవటం ఖాయమన్నారు. ‘‘ప్రసాదరాజు తప్పనిసరిగా కొద్ది రోజుల్లో మంత్రి అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కావాలంటే బహుశా సాటి కులస్థుడ్ని తిట్టాలని ఆజ్ఞ జారీ చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇంత ఓపెన్ గా ప్రత్యర్థులపై పార్టీ వ్యూహం ఏమిటో గుట్టు విప్పేసి సంచలనంగా మారారు రఘురామ కృష్ణంరాజు.

Next Story