దేవాలయాలను, మసీదులను కూల్చివేస్తుంటే ఒవైసీ, కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 10:52 AM GMT
దేవాలయాలను, మసీదులను కూల్చివేస్తుంటే ఒవైసీ, కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రెటేరియట్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసిన గుడి, మసీదుల విషయంలో న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఈ కూల్చివేతలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

సచివాలయంలోని అతి పురాతన దేవాలయం, మసీదును కూల్చడం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని విమర్శించారు. కేవలం తన మూఢనమ్మకాల కోసం వీటిని కూల్చివేయించారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

సచివాలయంలో దేవాలయాన్ని, మసీదు కూల్చివేతపై న్యాయం కోసం ఎంతవరకైన పోరాటం చేస్తామని, ఇది క్రిమినల్ చర్య అని అన్నారు. పార్లమెంటులో సైతం లేవనెత్తుతామన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌తో ఒవైసీ సోదరులు ఏం ఒప్పందం చేసుకుని మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్.

ఒవైసీ సోదరులు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న బాబ్రీ మసీదు గురించి మాట్లాడుతారు కానీ.. ఇక్కడ ఉన్న మసీదులను కూల్చి వేస్తూ ఉంటే ఏమీ మాట్లాడడం లేదని.. వారి నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయని అన్నారు. ఎంపీ కిషన్ రెడ్డి సైలెంట్ గా ఉండడం పై కూడా ఉత్తమ్ ఫైర్ అయ్యారు. అక్రమంగా దేవాలయాన్ని కూల్చివేస్తుంటే కిషన్ రెడ్డి కనీసం స్పందించడం లేదని.. ఈ ఒక్క ఘటన ద్వారా టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు ఒక్కటేనని స్పష్టమవుతోందని అన్నారు.

సెక్రటేరియట్ లో ఉన్న రెండు మసీదులను, ఓ దేవాలయాన్ని కూల్చి మనోభావాలను దెబ్బ తీశారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Next Story