వైట్‌హౌస్ లో లైట్లు ఆర్పితే అది దేనికి సంకేతం?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 8:38 AM GMT
వైట్‌హౌస్ లో లైట్లు ఆర్పితే అది దేనికి సంకేతం?

నల్లజాతీయుడ్ని దారుణాతిదారుణంగా హింసించిన శ్వేతజాతీయుడి వైనం యావత్ అమెరికాను రగిలిపోయేలా చేసింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డీసీలో నిరసనకారుల నిరసలతో అట్టుడికిపోయింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఆగ్రహం తాజాగా కనిపించింది. కట్టలు తెగిన కోపంతో నిరసనకారులు వైట్ హౌస్ మీదకే దండయాత్రకు వచ్చినంత పని చేశారు. ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎంత కష్టపడినా.. వారిని అదుపు చేయటం సాధ్యం కాలేదు. అతి కష్టమ్మీద వారిని నిలువరించారు.

తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు రాళ్లు..సీసాలు విసరటమే కాదు.. వైట్ హౌస్ సమీపాన ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో.. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ఉత్తర భాగంలో లైట్లు ఆపేశారు. సాధారణంగా అధ్యక్షుడు మరణిస్తేనే ఇలా చేస్తారని చెబుతున్నారు. వైట్ హౌస్ లో లైట్లు ఆపే అసాధారణ చర్య వెనుక ఈసారి కారణం వేరేగా ఉందని చెబుతున్నారు.

నిరసనకారుల లక్ష్యం వైట్ హౌస్ కావటంతో.. వారికి అంతుచిక్కని రీతిలో ఉండేందుకు వీలుగా భద్రతా సిబ్బంది లైట్లను ఆపేశారు. వైట్ హౌస్ లోని భద్రతాధికారుల వద్ద నైట్ విజన్ (చీకట్లోనూ చూసేందుకు వీలున్న పరికరాలు) పరికరాలు ఉండటంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ఇదే మంచి పనిగా భావించినట్లు తెలుస్తోంది. తాజా ఆందోళనను చూసి ట్రంప్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు చెబుతున్నారు. ఈ మాటల్ని విపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతలే చెప్పినట్లుగా అమెరికా మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే.. మీడియాపై మరోసారి నిప్పులు చెరిగారు ట్రంప్. నకిలీ వార్తలతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మీడియా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గడిచిన యాభై ఏళ్లలో అమెరికాలో ఈ స్థాయి నిరసనల్ని చూడలేదని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారితే.. 40కి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలు దేశాల్లో ఫ్లాయిడ్ హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి.

Next Story