వద్దు సార్.. అతడు జట్టును నాశనం చేస్తాడని ధోని చెప్పాడు : శ్రీనివాసన్
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 5:15 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఇప్పటి వరకు సీఎస్‌కే 10 సీజన్ల ఆడగా.. అన్ని సీజన్లకు ధోనినే నాయకత్వం వహించాడు. అతడి ఆధ్వర్యంలో చెన్నై మూడు సార్లు ఛాంపియన్లుగా నిలిచింది. ఇక ఎప్పుడూ కూడా కూల్‌గా ఉంటాడు కాబట్టి అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ఇక ధోని ఎవరినైనా నమ్మితే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ ఆటగాడిపై నమ్మకం కోల్పోడని ఇటీవల ఓ సందర్భంలో క్రికెటర్ సురేష్ రైనా చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా చెన్నైసూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను ఓ స్టార్ ఆటగాడిని జట్టులోకి తీసుకుందామని ధోనితో చెప్పాడట. అప్పుడు ధోని వద్దు సార్.. అతడు జట్టును నాశనం చేస్తాడు అని శ్రీనివాస్‌తో అన్నాడట. గ్రేట్ లేక్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
' ఓ సారి ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక ఆటగాడ్ని నేను సూచించా. అతను విపరీతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. అయినా ధోనీ వద్దన్నాడు. వద్దు సార్.. అతడు జట్టును నాశనం చేస్తాడు" అని నాతో అన్నాడు. ఆ సమయంలో జట్టు ఐక్యంగా ఉండడమే ముఖ్యం అనుకున్నా అని శ్రీనివాసన్ తెలిపారు. ఓ ఆటగాడిని అంచనా వేయడంలో ధోని దిట్ట. ఒక ఆటగాడి పట్ల ధోని ఒకటి ఫిక్స్ అయితే.. దానికి ధోని కట్టుబడి ఉంటాడు. అభిప్రాయాన్ని అయినా.. అపోహనైనా ధోని తేల్చిచెబుతాడని, అతడి జడ్జ్‌మెంట్ అలాగే ఉంటుందని శ్రీనివాసన్ చెప్పాడు.
ఇక మహేంద్రుడి రిటైర్‌మెంట్ పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020తో పాటు 2021 సీజన్‌లో కూడా ధోని సారధ్యంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ ఆడుతుందన్నాడు. ఒక్క వచ్చే ఏడాది మహేంద్రుడు వేలంలోకి వస్తే.. మేమే తీసుకుంటామన్నాడు. ధోనిపై నమ్మకం ఉందన్నాడు. కాగా..ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. సీఎస్‌కేపై నిషేధం సమయంలో రెండు సంవత్సరాలకు పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు.