ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఫస్ట్‌ మ్యాచ్‌.. ఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 6:41 AM GMT
ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఫస్ట్‌ మ్యాచ్‌.. ఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌కు మార్గం సుగమమైంది. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2020 సీజన్‌ ను నిర్వహించుకుంటామని బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు ఐపీఎల్‌ నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి ముమ్మర కసరత్తు చేసింది. ఇది ఫలించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కీలక పాత్ర వహించాడు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అవసరమైన ఉత్తర్వులు వారం రోజుల్లో వస్తాయని, ఈ నెల చివరలో జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టొచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అబుదాబి, దుబాయ్‌, షార్జాలలో 51 రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 10న జరగనుంది. చైనా కంపెనీలతో సహా అన్ని స్పాన్సర్లకు ఐపీల్‌ పాలక మండలి అనుమతి ఇచ్చింది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్‌ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం అరగంట ముందుగా అంటే.. రా.7.30కే మ్యాచ్‌లు మొదలు పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. ఇక మధ్యాహ్నం మ్యాచులు 3:30గంటలకు ఆరంభం అవుతాయి.

లీగ్‌ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా ఆటగాడు వైరస్ బారిన పడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులను అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై ఈసీబీతో మాట్లాడాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు త్వరలో పాలక మండలి మరో సారి సమావేశం కానుంది. ఇందులో ప్రధానంలో క్వారంటైన్‌ నిబంధనలు అనుసరించి బయో బబుల్‌ శిక్షణ కార్యక్రమాలు, ఆటగాళ్ల బస, ప్రయాణాలపై చర్చించనున్నారు. ఇక మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట నాలుగు జట్లు ఇందులో పాల్గొంటాయి.

ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి లీగ్ దేశంలో జరిగినా.. విదేశాల్లో జరిగినా కూడా.. ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం మాత్రమే నిర్వహించేవారు. అయితే.. ఈ సారి మాత్రం ఆనవాయితీ మారింది. ఫైనల్‌ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు.

Next Story