రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. ఇంగ్లాండ్ ఘ‌న‌విజ‌యం

By Medi Samrat  Published on  3 Aug 2020 1:28 AM GMT
రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. ఇంగ్లాండ్ ఘ‌న‌విజ‌యం

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం వేకువ‌జామున‌ ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వ‌న్డేల‌ సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఐర్లాండ్ జ‌ట్టు నిర్ణీత‌‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్‌ క్యాంఫర్‌ (68; 8 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యారు.

అనంత‌రం ల‌క్ష్య‌చేధ‌న‌కు దిగి‌న ఇంగ్లాండ్‌ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెన‌ర్‌ బెయిర్‌స్టో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 82; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు)... చివర్లో స్యామ్‌ బిల్లింగ్స్‌ (61 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు), డేవిడ్‌ విల్లీ (46 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ల‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌కు సిరీస్‌ విజయాన్ని కట్టబెట్టింది.

ఒక దశలో 131/3తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌.. 6 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే బిల్లింగ్స్, విల్లీ అజేయమైన ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ఇదిలావుంటే సిరీస్‌లో చివ‌రిదైన మూడో వ‌న్డే రేపు జ‌రుగ‌నుంది.

Next Story