రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. ఇంగ్లాండ్ ఘనవిజయం
By Medi Samrat Published on 3 Aug 2020 6:58 AM ISTఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం వేకువజామున ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (68; 8 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లాండ్ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ బెయిర్‌స్టో ధనాధన్ ఇన్నింగ్స్ (41 బంతుల్లో 82; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు)... చివర్లో స్యామ్ బిల్లింగ్స్ (61 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు), డేవిడ్ విల్లీ (46 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ల బాధ్యతాయుత బ్యాటింగ్ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాన్ని కట్టబెట్టింది.
ఒక దశలో 131/3తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్.. 6 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే బిల్లింగ్స్, విల్లీ అజేయమైన ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ఇదిలావుంటే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే రేపు జరుగనుంది.