దారుణం.. భర్త మర్మాంగం కోసేసి..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2020 9:37 PM ISTపశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటన రెండ్రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా.. ఎంతో అన్యోన్యంగా మెలగుతూ..ఇతరులకు ఆదర్శంగా కలిసి మెలసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు ఆ దంపతులు. 15 ఏళ్లు గడిచే సరికి వారి కలలన్నీ కల్లలయ్యాయి. ఏమైందో ఏమోగాని ఇద్దరూ మద్యానికి బానిసలయ్యారు. ఇంట్లో ఈడొచ్చిన కూతురుందన్న విషయాన్ని మరచిపోయి నిత్యం గొడవపడేవారు. ఫలితంగా ఆ భార్య భర్తను మంచానికి కట్టేసి..అతి కిరాతకంగా హత్య చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ లోని దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా కూతురు పుట్టింది. ఇద్దరికీ సరైన చదువు లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేవారు. కానీ.. కొంతకాలంగా ఇద్దరూ మద్యానికి బానిసలయ్యారు. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
దీంతో భర్త చేష్టలకు విసిగిపోయిన లక్ష్మి బుధవారం (జూన్ 3) మద్యం మత్తులో ఉన్న భర్తను ఇంట్లో ఉన్న నవ్వారు మంచానికి కట్టేసి మెడకు ఓ తాడు బిగించి ఊపిరాడకుండా చేసింది. అనంతరం భర్త మర్మాంగాన్ని కోసేసి కిరాతకంగా చంపేసింది. ఈ విషయాన్ని మృతుడి సోదరుడు నాగేశ్వరరావుకు చెప్పి వెంటనే పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, లక్ష్మిని విచారిస్తున్నారు.