మిగిలిన రాష్ట్రాలకు భిన్నం దీదీ రాజ్యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 6:21 AM GMT
మిగిలిన రాష్ట్రాలకు భిన్నం దీదీ రాజ్యం

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. ఆ దెబ్బకు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం భారీగా పడిపోవటం తెలిసిందే. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేసే పలు రాష్ట్రాలు.. కరోనా కారణంగా తగ్గిన ఆదాయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో.. అన్ లాక్ అంటూ కేంద్రం ప్రకటించినంతనే మారు మాట్లాడుకుండా వీలైనంత ఎక్కువగా అన్ని వ్యాపార సముదాయాలు.. వాణిజ్య కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. అన్ లాక్ కారణంగా కేసులు పెరుగుతున్నా.. వాటి వరకు చర్యలు తీసుకుంటున్నారే కానీ.. లాక్ డౌన్ ఆలోచన చేయటానికి సైతం ఇష్టపడని పరిస్థితి.

దీనికి కారణం ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడటమే. ఇదిలా ఉంటే.. మిగిలిన వారికి కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తెలుగురాష్ట్రాలతో పాటు.. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తే.. దీదీ రాజ్యంలో మాత్రం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. కాకుంటే.. వారానికి రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఈ విధానాన్ిన సెప్టెంబరు 17 వరకు కొనసాగించాలని తాజాగా ఆమె నిర్ణయించారు.

ఓపక్క అన్ లాక్ లో భాగంగా ఇప్పటికి మూతబడిన సంస్థల్ని తెరిచేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉండగా.. అందుకు భిన్నంగా దీదీ మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. స్కూళ్లు.. కాలేజీలు సైతం వచ్చే నెల 20 వరకు మూసి ఉంచాలని ఆదేశించారు. లాక్ డౌన్ వేళ.. అత్యవసర సేవలు తప్పించి.. మిగిలిన వారంతా తమ షాపుల్ని సంపూర్ణంగా మూసివేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం గండిపడుతుందని తెలిసినా.. కేసులు పెరిగేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా దీదీ.. దీదీనే బాస్.

Next Story
Share it