బీ అలర్ట్.. మరో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు
Weather of Telangana and Andhra Pradesh.. Rains for three days. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై మాండౌస్ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది.
By అంజి Published on 12 Dec 2022 9:53 AM ISTఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై మాండౌస్ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. తుపాను అల్పపీడనంగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీంతో ఇవాళ దక్షిణ కోస్తా ఆంధ్రా, ఉత్తర కోస్తా ఆంధ్రా, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల మీదుగా వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మాండస్ తుపాను ప్రభావం హైదరాబాద్‌లో చిరు జల్లులు పడుతున్నాయి. ఓ వైపు చలి గాలులు, మరోవైపు ముసురు వాతావరణం నెలకొనడంతో చలితో జనం ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు గత నిన్న కురిసిన వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, నారాయణగూడ, హయత్ నగర్, సరూర్ నగర్ సహా దాదాపు నగరమంతా ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.