తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, వచ్చే రెండ్రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ వడగళ్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుండి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వాయువ్య భారత ప్రాంత గాలుల్లో అస్థిరత ఏర్పడటంతో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
మరో వైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గింది. ఈ నెల 10,11వ తేదీన రాష్ట్రంలోని కొమురంభీం-అసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగళ్ల వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు కానుంది.