వెంటాడుతున్న వరుణుడు.. నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Weather alert Heavy rains expected for the next three days in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వదిలేలా
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2021 8:26 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. అనంతపురం, కడప, జిల్లాల్లో మోసార్తు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోసార్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తాంద్రలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విధంగా రేపు, ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో మోసార్తు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కడప జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై వరుణుడు పగ పట్టాడా అన్న స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. మొన్న కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చెరువు కట్టలు తెగి పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. ఆ వరద నుంచి ఆ నాలుగు జిల్లాలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే.. ఇప్పుడు మరో హెచ్చరిక జారీ కావడం ఆందోళన కలిగిస్తోంది.