తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో చెదురుముదురు వర్షాలు పడనున్నాయి.
ఏపీతో పాటు యానాం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. వడగళ్ల వానలు కుడా కురిసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.