తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మే మధ్యలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, అయితే మే ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, రెండు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.