భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్, తెలంగాణకు వేడిగాలుల నుండి ఉపశమనం లభించిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25 వరకు ఎటువంటి వేడిగాలులు ఉండవని అంచనా వేస్తోంది. ఏప్రిల్ 9న రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడ్డాయి. నిన్న, నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఏప్రిల్ 15 వరకు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18- ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే ఐదు రోజుల్లో హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత నెల రోజులుగా తీవ్రమైన ఎండలను చూసిన హైదరాబాద్‌లో శుక్రవారం నాడు చాలా వరకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఉంది. చల్లని గాలులు సాయంత్రం సమయంలో హైదరాబాదీలకు ఆనందాన్ని పంచుతున్నాయి.