ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ నుండి అతి భారీ వర్షపాతం (115.6 మి.మీ మరియు 204.5 మి.మీ కంటే ఎక్కువ) నమోదయ్యే అవకాశాలను ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు భారీ నుంచి అతిభారీ (204.5 మి.మీ వరకు) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో వైపు అదనంగా ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలు స్వీయరక్షణలో ఉండాలి: మంత్రి సీతక్క
అతిభారీ వర్ష సూచనతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ములుగు, మహబూబాబాద్ , జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచనలతో మంత్రి అధికారులకు సూచనలు చేశారు. మంగపేట , ఏటూరు నాగారం తాడ్వాయి లో భారీ వర్షాలు వర్షాలు కురిసాయి. భారీ వర్షాలు పడుతున్న సందర్భంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేశాం. వాగులు , వంకల ప్రవాహం ఎక్కువగా ఉంటే బయటకు రాకండి. భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు స్వీయ రక్షణలో ఉండాలి..అని మంత్రి సీతక్క కోరారు.