బ్రేకింగ్ : తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
Red Alert For Telangana Districts. తుపాను ప్రభావం దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది
By Medi Samrat Published on 27 Sept 2021 5:50 PM ISTతుపాను ప్రభావం దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు.
ఇదిలావుంటే.. తుపాను గులాబ్ నిన్న రాత్రి తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు దక్షిణ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాలలోని దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాలలో కొనసాగుతుంది. రాగల ఆరు గంటలలో మరింత బలహీన పడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఆ తదుపరి 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య, పరిసర ఈశాన్య బంగళాఖాతంలోని మయన్మార్ తీరంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి మధ్యస్త ట్రోపో స్పీయర్ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది
దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు) 30 నుండి 40కీ.మీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.