తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది.
By అంజి Published on 25 July 2024 6:54 AM ISTతెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండగా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నేడు ప్రకాశం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాల పడే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం,మన్యం,అల్లూరి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.లో
అటు తెలంగాణలో..
అటు తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు వెళ్లరాదని అధికారులు సూచించారు.