నేడు, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్
Rain Alert For Telugu States. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుపానుగా
By అంజి Published on 21 March 2022 8:48 AM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం రాత్రి తెలియజేసింది. అల్పపీడనం సోమవారం మధ్యాహ్నం వరకు తీవ్ర వాయుగుండగా మారనుంది. ఆ తర్వాత మరో 12 గంటల్లో తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అసని తుఫాను అండమాన్ దీవుల వెంట మయన్మార్, దక్షిణ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అండమాన్, నికోబార్ దీవుల పాలనా యంత్రాంగం ఆసాని తుఫాను సమీపిస్తున్న తరుణంలో భారీ వర్షం, బలమైన గాలులు తాకుతుండటంతో అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. అసని తుపాను అండమాన్ దీవుల వెంట మయన్మార్, దక్షిణ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అండమాన్ దీవుల్లో తుపాను తీరం దాటదని ఆయన స్పష్టం చేశారు. పోర్ట్ బ్లెయిర్‌తో సహా ఉత్తర, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ జిల్లాల్లో అసని తుఫాను సమీపిస్తున్నందున భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అండమాన్, నికోబార్ దీవుల పరిపాలన యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.