తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ఈ రోజు రాత్రికి లేదా.. రేపటి ఉదయానికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండంగా మారిన శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.