తెలంగాణలో ఐదురోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటూ ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. గురువారం నాడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.