Rain Alert : వర్షాలు వస్తున్నాయి.. జాగ్రత్త
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 21 Sep 2024 2:55 AM GMTహైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. GHMC పరిధిలో అత్యధికంగా ఉప్పల్‌లోని చిల్కానగర్‌లో 36.8 మిమీ, నాచారంలో 21.8 మిమీ, బండ్లగూడలో 20 మిమీ, హబ్సిగూడ (18.8 మిమీ), ఉస్మానియా విశ్వవిద్యాలయం (17.0 మిమీ), నాగోల్ (17.0 మిమీ) వర్షపాతం నమోదైంది.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నాడు కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆదివారం నాడు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మధ్య బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనా వేశారు అధికారులు.