హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం పడుతుందనే సూచన జారీ చేసింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మూసీ నదికి పెరిగిన వరద ఉధృతి:
మూసీనదికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. 645అడుగుల (4.46టీఎంసీ) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 644.40అడుగులకు(4.30టీఎంసీ) చేరిందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వర్షాలతో వరద మూసీకి వచ్చి చేరుతోందని.. దీంతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుతోంది. నీటి విడుదల విషయమై ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే ఆయకట్టు ప్రజలు, రైతులను అప్రమత్తం చేశారు అధికారులు.