హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ టీ బాలాజీ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం తెల్లవారుజామున కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని బాలాజీ హెచ్చరించారు.
భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన సూచన ప్రకారం, సెప్టెంబర్ 16, మంగళవారం హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, పగటిపూట వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు లేదా మబ్బుతో కూడిన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, డ్రైనేజీ మూసుకుపోయే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.