హైదరాబాద్ నగరంపై వరుణుడు కనికరం చూపించడం లేదు. మరోసారి భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది. నగరంలో నేడు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం, హైడ్రా రెస్క్యూ బృందాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గురువారం రాత్రి కురిసిన ఆకస్మిక వర్షానికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో గురువారం రాత్రి 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని, మళ్లీ అదే తరహాలో వర్షం కురిస్తే ఆ ప్రాంతాలు మళ్లీ జలమయం అయ్యే ప్రమాదం ఉంది.