రాబోయే రెండు రోజులు అతిభారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Medi Samrat
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
భారీవర్షాలు, బలమైన గాలులు నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.
కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్, ఔట్ ఫ్లో 2.87 లక్షల క్యూసెక్కులు ఉందని వర్షాల నేపథ్యంలో రేపు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. గోదావరి వరద ధవళేశ్వరం వద్ద 4.07లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నదులు, పొంగిపొర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
సోమవారం(18-08-25)
•శ్రీకాకుళం,విజయనగరం,
పార్వతీపురంమన్యం,
అల్లూరి సీతారామరాజు,
విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
•కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం(19-08-25)
* చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
* శ్రీకాకుళం, విజయనగరం,
పార్వతీపురంమన్యం,
అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి విశాఖ జిల్లా కాపులుప్పాడలో 144మిమీ, పరదేశీపాలెంలో 129మిమీ, మధురవాడలో 122మిమీ, ఆనందపురంలో 114మిమీ, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 113.5 మిమీ, విశాఖ జిల్లా శ్రీరామ్ నగర్ మరియు పెందుర్తిలో 111మిమీ
చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.