బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది.
విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఉదయం వేసవి కాలం ఎండలు.. సాయంత్రం అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత వర్షం కురుస్తుందని అధికారులు చెబుతున్నారు.