శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. రేపటి నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందన్నారు. ఎగువ వర్షాలకు కృష్ణానది కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. కృష్ణా, పెన్నా నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న ఉపనదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత మరోసారి నిజమైంది. టెక్నాలజీ సహాయంతో పెను ప్రమాదాలు తప్పాయి. విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేస్తుంది. కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. హుటాహుటిన స్పందించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా SDRF, డ్రోన్ల బృందంతో సమన్వయం చేసుకుని పర్యవేక్షించారు.
డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించి ఎస్‌డిఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చి ప్రమాదం తప్పించారు. కృష్ణా నది వరద ఉధృతిలో ప్రకాశం బ్యారేజి గేట్ల దగ్గరకు వచ్చి ఉంటే పెనుముప్పు సంభవించేది.గత సంవత్సరం బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజి గేటులో చిక్కుకున్న బోటు తీయడానికి ఎనిమిది రోజులపాటు, అధికార యంత్రాంగం పడిన శ్రమ గుర్తు చేసుకున్నారు.