నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి & దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే.. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి నెల్లూరు(జి) మర్రిపాడులో 89.2మిమీ, మొగిలిచెర్లలో 79మిమీ, కృష్ణా(జి) భవదేవరపల్లిలో 75మిమీ, ప్రకాశం(జి) ఉమారెడ్డిపల్లెలో 62.2మిమీ, గుంటూరు(జి) దుగ్గిరాలలో 61.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.