ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది. నెల్లూరు(జి) అనంతసాగరం లో 31.7మిమీ, కడపలో 28.5మిమీ, నెల్లూరు(జి) దూబగుంటలో 27.2మిమీ, ప్రకాశం(జి) పొదిలిలో 25.5మిమీ వర్షపాతం నమోదైందని తెలిపింది.