కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు.
వీటి ప్రభావంతో మంగళవారం(14-10-2025) ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించారు.
సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు(జి) లింగపాలెంలో 74.2మిమీ, చింతలపూడిలో 68.7మిమీ, బాపట్లలో 62.5మిమీ, విజయనగరం(జి) పులిగుమ్మిలో 61మిమీ, కృష్ణా(జి) ఉయ్యూరులో 60.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.