Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 6:56 PM IST

Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆతరువాత పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి దక్షిణఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

దీని ప్రభావంతో రేపు ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం(01-10-25):

• శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు,మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని,అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

మంగళవారం సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి(జి) యలమంచిలిలో 40.5మిమీ,కృష్ణా(జి) పెడనలో 39.5మిమీ, అనకాపల్లి(జి) కొప్పాకలో 34.7మిమీ, నర్సీపట్నం, కాకినాడలో 34మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరోవైపు కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతుందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు.7లక్షల క్యూసెక్కుల లోపు వరద చేరే అవకాశం ఉందన్నారు.

గోదావరి నది భద్రాచలం వద్ద 50.30 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు ఉండి మొదటి హెచ్చరిక కొనసాగుతుందన్నారు. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరి ఆతరువాత గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సహాయక చర్యల కోసం 3 NDRF, 4 SDRF బృందాలు ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Next Story