బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

By -  Medi Samrat
Published on : 26 Sept 2025 8:20 PM IST

బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ఈరోజు రాత్రి దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. రేపు దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రేపు కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 44.7 అడుగుల నీటిమట్టం, ధవళేశ్వరం వద్ద 5.34 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల్లో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చుతగ్గులను గమనిస్తూ నది పరీవాహక ప్రాంత గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ, రేపు ఎగువ రాష్ఠ్రాల్లో కురిసే వర్షపాతం ఆధారంగా రెండు, మూడు రోజుల్లో దాదాపు హెచ్చరిక స్థాయి వరకు వరద చేరే అవకాశం ఉంటుందన్నారు.

శనివారం(27-09-25):

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో 58.7మిమీ, శ్రీకాకుళం(జి) ఆమదాలవలసలో 54మిమీ, శ్రీకాకుళంలో 48.7మిమీ, విజయనగరం(జి) నెల్లిమర్లలో 42.7మిమీ, డెంకాడలో 42.7మిమీ, ప్రకాశం(జి) పెద్దారవీడులో 42మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

Next Story