వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రఅల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 54మిమీ,విశాఖ జిల్లా గాజువాకలో 53.2మిమీ, అనకాపల్లి జిల్లా వేంపాడులో 44.5మిమీ, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 44.2మిమీ, విజయనగరం జిల్లా మెరకముడిదాంలో 36మిమీ చొప్పున వర్షపాతం రికార్డయిందని వెల్లడించారు.
గోదావరి నది వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు గోదావరి భద్రాచలం వద్ద నీటి మట్టం 40.7 అడుగులు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 8,67,660 క్యూసెక్కులు ఉందన్నారు. కృష్ణానది వరద తగ్గుముఖం పట్టిందని ప్రకాశం బ్యారేజి వద్ద 76,216 క్యూసెక్కులు ఉందన్నారు.
కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.