ఈశాన్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.
•రేపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
•శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
•కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 76.7మిమీ, శ్రీకాకుళం జిల్లా లావేరు 65.5మిమీ, మన్యం జిల్లా జియమ్మవలసలో 63.7మిమీ,
విజయనగరం పెద్దనడిపల్లిలో 61.5మిమీ, అనకాపల్లి జిల్లా నరసింగపల్లిలో 60మిమీ చొప్పున వర్షపాతం రికార్డ్ అయిందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 44.4 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11. 91 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు ఉందని, దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.