Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat
Published on : 26 Aug 2025 6:46 PM IST

Rain Alert : రాబోయే రెండు రోజులు భారీ వ‌ర్షాలు

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

బుధవారం(27-08-25)

 అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం(28-08-25)

 కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి సాలపువానిపాలెంలో 60.2మిమీ, శ్రీకాకుళంలో 58మిమీ, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 55.7మిమీ అనకాపల్లి జిల్లా గంధవరంలో 55.5మిమీ, లంకేలపాలెంలో 55.2మిమీ, విజయనగరం అర్బన్ 54.7మిమీ చొప్పున వర్షపాతం, 65 ప్రాంతాల్లో 40మిమీకు పైగా వర్షపాతం నమోదైందన్నారు.

Next Story