పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదన్నారు.
రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69మిమీ, నర్సన్నపేటలో 62.5మిమీ, కోటబొమ్మాళిలో 53.2మిమీ, మందసలో 48.7మిమీ, రాజాపురంలో 46.2మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.