నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో తీవ్రవాయుగుండం కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 320 కి.మీ, చెన్నైకి 340 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. వాయువ్య దిశగా కదులుతూ రాగల 3 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో దక్షిణకోస్తాలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రేపు కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు.. రాయలసీమలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు.. మిగిలినచోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి 70-80కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.